పంచాయతీ సిబ్బందికి తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కారు

  • రాష్ట్రంలోని 50 వేల మంది పంచాయతీ సిబ్బందికి ఒకటో తారీఖునే జీతాలు
  • జీతాల కోసం ప్రతినెలా రూ. 50 కోట్ల ప్రత్యేక నిధుల విడుదల
  • గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ కీలక నిర్ణయం
  • పోస్టల్ విధానం రద్దు.. ఇకపై పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ
  • అర్హులైన వారికి కొత్త పెన్షన్ల మంజూరుకు మొదటి ప్రాధాన్యత
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. సుమారు 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు సమయానికి జీతాలు అందినట్లే, క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ సిబ్బందికీ వేతనాలు అందాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు.

గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యం జరగకుండా, ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ.50 కోట్లను ప్రత్యేకంగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కేవలం పంచాయతీ సిబ్బందికే కాకుండా, ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ నెల మొదటి రోజే జీతాలు అందేలా చూడాలని తేల్చిచెప్పారు. సిబ్బంది జీతాల చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైనా సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు.

ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో జమ చేయాలన్న నిబంధనను రద్దు చేయాలని ఆదేశించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 70(3)కి సవరణలు చేసి, పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీకి బదులుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది పంచాయతీల ఆర్థిక స్వేచ్ఛను పునరుద్ధరించడానికి దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

పెన్షన్ల పంపిణీ విధానంలోనూ మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పెన్షన్లను ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, అనర్హులను ఏరివేయడం సులభమవుతుందని తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్, సామాజిక-ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) డేటాను ఉపయోగించి పెన్షన్ల క్రమబద్ధీకరణ చేపట్టాలన్నారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Revanth Reddy
Telangana
Panchayat employees
Telangana government
Village secretariat
Salary payments
Pension disbursement
Financial autonomy
SECC data
Sitakka

More Telugu News